- కడిపికొండ జంట మర్డర్ల మిస్టరీ ఛేదించిన పోలీసులు
హనుమకొండ, వెలుగు: అదనపు కట్నం కోసం వేధించిన తనను చంపుతారనే భయంతో భార్యతో పాటు మామను హతమార్చిన నిందితుడిని మడికొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి శనివారం సాయంత్రం వివరాలు వెల్లడించారు.
కడిపికొండ రాజీవ్ గృహకల్పకు చెందిన రాజశేఖర్(51), అతని కూతురు రాజశ్రీ(24)ను వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట హవేలీకి చెందిన పొక్కుల ప్రవీణ్ కు ఇచ్చి పెండ్లి చేశారు. వారికి ఏడాదిన్నర బాబు, ఆరు నెలల పాప ఉన్నారు. తనకు అదనపు కట్నం కావాలని ప్రవీణ్ వేధింపులకు పాల్పడేవాడు. మామ రాజశేఖర్ ను పలుమార్లు కట్నం కోసం వేధించగా.. కట్నం కోసం ఇబ్బంది పెడితే చంపేస్తానని బెదిరించాడు.
దీంతో ప్రవీణ్ మామపై కోపం పెంచుకున్నాడు. తన కూతురు అన్నప్రాసన కోసం రాజశ్రీ, ప్రవీణ్ దంపతులు కడిపికొండలోని రాజీవ్ గృహకల్పకు రాగా.. గత మంగళవారం రాత్రి కట్నం విషయంలో రాజశ్రీ, ప్రవీణ్ కు గొడవ జరిగింది.
దీంతో తనను చంపేస్తారనే భయంతో ఇద్దరిపై సుత్తితో దాడి చేసి ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నం చేశాడు. ఇద్దరిపై డీజిల్ పోసి నిప్పంటించాడు. అనంతరం ప్రవీణ్ హైదరాబాద్ కు పారిపోయాడు. శనివారం వరంగల్ కు వచ్చిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హత్యకు ఉపయోగించిన సుత్తితో పాటు డీజిట్ బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు.
